ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులకు జగన్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసిన ఏపీ ప్రభుత్వం పండుల వేళ మరో గుడ్ న్యూస్ అందించింది. కార్మికులకు సంక్రాంతి పండుగ అడ్వాన్స్ చెల్లించేందుకు నిధులు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అడ్వాన్స్ కోసం రూ.19 కోట్లు మంజూరు చేసినట్లు ఆర్టీసీ యాజమాన్యం గురువారం ప్రకటించింది. 

వచ్చే నెల 1 వ తేదీన డిసెంబర్ నెల వేతనంతో కలిపి అడ్వాన్స్ చెల్లించాలని ఆర్టీసీ ఎండీ ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. కేటగిరీల వారీగా అడ్వాన్స్ మొత్తం అందించనున్నారు. క్లాస్ - 3 కేటగిరీ ఉద్యోగులకు రూ.4,500.. క్లాస్ - 4 కేటగిరీ ఉద్యోగులకు రూ.4 వేలు అడ్వాన్స్‌గా ఇవ్వనున్నారు. పండుగ సమయంలో ఇచ్చిన అడ్వాన్స్‌ను ఉద్యోగుల వేతనాల నుంచి పది నెలల్లో రికవరీ చేసుకుంటారు. 

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీ కార్మికులపై వరాల జల్లు కురిపించింది. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానన్న ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా వడివడిగా అడుగులేసింది. విలీన ప్రక్రియకు గతంలోనే రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలుపగా.. జనవరి నుంచి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు సభ ఆమోదం పొందింది. దీంతో సంస్థలో పనిచేస్తున్న 52 వేల మంది ఉద్యోగులు జనవరి ఒకటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులేనని ప్రకటించారు.