అసెంబ్లీలో టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భావోద్వేగానికి లోనయ్యారు.  సోమవారం నాడు మద్యం పాలసీపై ఈమె అసెంబ్లీలో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సంబంధిత మంత్రి, స్పీకర్ తమ్మినేని ఆమె మాటలకు బదులిచ్చారు. అయితే ఇవాళ మరోసారి అసెంబ్లీలో మాట్లాడిన ఆమె.. మద్యం పాలసీపై మాట్లాడే హక్కు తనకు లేదా? అని ప్రశ్నించారు. మద్యం గురించి మీకెందుకని మీరు కూడా అంటున్నారని స్పీకర్‌ను ఉద్దేశించి భవానీ వ్యాఖ్యానించారు. 'మద్యంపై నేను అనని మాటలను అన్నట్టుగా వక్రీకరించి నాపై సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలి. నాపై ట్రోల్‌ చేసినవారిలో వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. దిశ చట్టం అమలు నాతోనే మొదలుపెట్టండి' అని స్పీకర్‌ను ఆదిరెడ్డి భవాని కోరారు.

భవానీ నిన్న ఏమన్నారు..!? తాగుబోతుల చేష్టలతో మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ప్రభుత్వం స్పందించి వైన్ షాపు, బార్లను నివాస ప్రాంతాలకు దూరంగా ఉంచాలని ఏపీ అసెంబ్లీలో డిమాండ్ చేశారు. కమిషన్ తీసుకుని ప్రభుత్వం కొన్ని రకాల మందు బ్రాండ్లను మాత్రమే వైన్ షాపుల్లో ఉంచుతుందని చెప్పడానికి ఆమె ప్రయత్నించారు. అయితే మహిళ ఎమ్మెల్యే మందు బ్రాండ్ల ప్రస్తావన తేవడంతో తోటి ఎమ్మెల్యేలు నవ్వు ఆపుకోలేకపోయారు. తోటి సభ్యులు ముసిముసి నవ్వులు నవ్వుతుండగా.. ఆమె కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. అది గమనించి స్పీకర్ తమ్మినేని సీతారాం జోక్యం చేసుకుని 'నీకెందుకురా తల్లి ఆ బ్రాండ్ల విషయం వాళ్లు మాట్లాడతారు వదిలేయ్' అని అన్నారు.